సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తుండటంతో ఇటలీకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఉంటున్న తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న, చదువు పూర్తయిన 16 మంది తెలంగాణ విద్యార్థులు స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తుండగా ఆ దేశం నిరాకరిస్తోంది. కోవిడ్ భయంతో వారిని రోమ్ ఫిమిసినో విమానాశ్రయంలో అధికారులు నిలిపివేశారు. తెలంగాణ విద్యార్థులతోపాటు కేరళ, బెంగళూరు, నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టంచేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నారు.
కేంద్రమంత్రి హర్షవర్దన్‌కు మంత్రి ఈటల ఫోన్...
ఇటలీలో చిక్కుకున్న 16 మంది తెలంగాణ విద్యార్థులను రప్పించే విషయంపై తాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఎలాగైనా మన విద్యార్థులను రప్పించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.